గతంలో బాలీవుడ్ మూవీస్ పెద్దగా తెలుగులో వచ్చేవి కావు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బాలీవుడ్ సినిమాలు సైతం ఏకకాలంలో హిందీతో పాటు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ‘లాల్‌సింగ్ చద్దా’ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ అమీర్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను అమీర్‌ఖాన్ ప్రారంభించారు. తాజాగా సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలైంది.
బాస్కెట్ బాల్ కోచ్‌గా ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కనిపించారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బాస్కెట్ బాల్ కోచ్ ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. కోర్టులో ఆయనకు మతిస్థిమితం లేని వాళ్లకు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలంటూ జడ్జి తీర్పునిస్తారు. ఆ తరువాత అమీర్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. చివరకు మతిస్థిమితం లేని వాళ్లకు కోచింగ్ ఇచ్చి వాళ్లను విజేతలుగా నిలిపారా? లేదా? అనే ఆసక్తికర అంశంతో సినిమా రూపొందింది. ఈ సినిమాకు అమీర్ ఖానే నిర్మాతగా సైతం వ్యవహరించారు. ఈ సినిమాను తాజాగా పలువురు సెలబ్రిటీల కోసం ప్రదర్శించగా వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.