‘కన్నప్ప’ సినిమా విషయమై ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. మంచు విష్ణు కీలక పాత్రలో ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది తాజాగా బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రలపై వివాదం చెలరేగింది. వారిద్దరి పాత్రలు పేర్లు.. తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. పేర్లను తొలగించకుంటే సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీనిపై మంచు విష్ణు తాజాగా స్పందించాడు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తీర్చిదిద్దామని మంచు విష్ణు తెలిపారు.
హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. నిత్యం భక్తితో పూజ నిర్వహించి.. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న మీదటే చిత్రీకరణ ప్రారంభించేవారమని వెల్లడించారు. పలువురు ఆధ్యాత్మికవేత్తలు, వేదాధ్యయనం చేసిన వారి నుంచి స్క్రిప్ట్ దశలోనే సలహాలు స్వీకరించినట్టు తెలిపారు. భక్తితత్వాన్ని వ్యాప్తి చేయడమే తమ సినిమా లక్ష్యమని.. వివాదాలు ఎంత మాత్రం కాదని మంచు విష్ణు వెల్లడించారు. సినిమా విడుదలయ్యే వరకూ ఓపికతో ఉండాలని హితవు పలికారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మంచు విష్ణు ఇచ్చిన క్లారిటీతో సదరు వర్గం శాంతిస్తుందో లేదో చూడాలి.