Devi Prasad :
అన్నీ ఉన్నా నిట్టూరుస్తూ బతికే జీవితాల మధ్యలో ఓ మంచి పాజిటివ్ వాయిస్ వినిపించింది. నా జీవితమంతా అద్భుతం, అమోఘం, ఆనందభరితం అని చెప్పటానికి జీవితానికి సంబంధించిన అనేక తీపి గుర్తులు ఉండాలి. అవి నా జీవితానికి సరిపడా ఉన్నాయి అని చెప్పటానికి ఎంతో గొప్పగా జర్నీ చేసి ఉండాలి. ఈ రెండు పుష్కలంగా తన జీవితంలో ఉన్న శిష్యుడు, దర్శకుడు, నటుని,రైటర్, ఆర్టిస్ట్ కథే ఈ స్టోరీ. తెలిసితెలియని వయసులో కాలేజీ గొడవలు, పోలీసుకేసుల నుండి తప్పించుకోవటానికి ఓ చోటు అవసరమైంది.
అలా ఒక చోటు వెతుక్కుంటూ ఏదో ఒకటి చేయొచ్చులే అంటూ మద్రాసు రైలెక్కిన ఆ 19 ఏళ్ల కుర్రోడికి ఎదురైన అనుభవాలేంటి? చిత్ర పరిశ్రమకు ఇతనికి సంబంధం ఏంటి? తనకెటువంటి సంబంధంలేని చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చాడు? ఎందుకొచ్చాడు? అనే పాయింటే ఎంతో వెరైటీగా అనిపించింది. ఆరోజు నుండి మొదలుకొని ఈ రోజువరకు తన జర్నీని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారాయన.
ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారి శిష్యునిగా తన తోటి అసిస్టెంట్ డైరెక్టర్లకు మంచి స్నేహితునిగా మెలిగిన ఆ రోజులను ఎంత బాగా వర్ణించారో ఇంటర్వూ చూస్తేనే అర్థమవుతుంది. తన ప్రమేయం లేకుండానే దర్శకునిగా అవకాశం దక్కించుకుని మొదటి చిత్రం ‘ఆడుతూ పాడుతూ’ సినిమాతోనే దర్శకునిగా మంచి మార్కులు వేయించుకున్న దర్శకుడు దేవిప్రసాద్ గారు. దర్శకునిగా అనేక చిత్రాలు చేసిన తర్వాత అనుకోకుండా నటునిగా చేసే అవకాశం దేవిగారి తలుపుతట్టింది.
కట్ చేస్తే శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో నటునిగా చక్కని గుర్తింపు వచ్చింది. మనపని సినిమాలో నటించటం కాదులే అని తర్వాత వచ్చిన అనేక పెద్ద సినిమాల్లో ఆయన నటించలేదు. అప్పుడు గురువుగారు కోడి రామకృష్ణ గారు ఏంచెప్పారు? మళ్లీ ఎందుకు సినిమాల్లో నటించారు అనే పాయింట్ నటునిగా తన కెరీర్‌కే బిగ్‌బ్రేకింగ్ పాయింట్. ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక పాడ్‌కాస్ట్ తొలిభాగం ఇది. మలి భాగంలో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. ఈ ఇంటర్వూ చూస్తే మద్రాస్‌లో పనిచేసిన ప్రతి టెక్నిషియన్ ఎందుకు గౌరవింపబడతారో తెలుస్తుంది. ఇంటర్వూ బై
శివమల్లాల