పెద్ద హీరోల నుంచి అప్డేట్ వస్తే ఆ కిక్కే వేరప్పా. వేరే హీరోలకు సంబంధించి ఒకటో అరో అప్డేట్స్ వస్తున్నాయి కానీ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒక్కటీ బయటకు రావడం లేదు. ‘రాజాసాబ్’ సినిమా ఎప్పుడో మొదలు పెట్టడంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది కానీ షూటింగే ఇంకా పూర్తి కాలేదు. దీంతో పోస్ట్‌పోన్ చేశారు. అయితే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి టీజర్ విడుదలయ్యే సమయం ఆసన్నమైందని మాత్రం తెలుస్తోంది. దీనికి కారణం మారుతి వేసిన ట్వీటే. ‘హై అలర్ట్.. మే మధ్య నుంచి వేడిగాలులు మరింత తీవ్రమవుతాయి’ అంటూ మారుతి ట్వీట్ చేశారు.
మొత్తానికి మే మధ్యలో ‘రాజాసాబ్’ టీజర్ విడుదలవడం ఫిక్స్.. మారుతి ట్వీట్ దాని గురించేనంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ ఊహలకు పదును పెట్టేశారు. మారుతి టీజర్‌ను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారంటూ రచ్చ చేస్తున్నారు. తమన్ రీరికార్డింగ్ మొదలు పెట్టేశారని.. ప్రభాస్ లుక్స్.. టీజర్ కంటెంట్.. తమన్ మ్యూజిక్ బీభత్సంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఒక్క ట్వీట్‌తో మారుతి టీజర్‌పై అంచనాలకు ఆకాశానికి అంటేలా చేశారు. ఏమాత్రం లోటు జరిగినా ఫ్యాన్స్ ఊరుకోరని మాత్రం తెలుస్తోంది. మే మిడ్ సంగతేమో కానీ ఏప్రిల్ ఎండింగ్కే హీట్ వేవ్స్‌ను మారుతి ట్వీట్ తీవ్రతరం చేసింది. ఫ్యాన్స్ అనుకుంటున్న ప్రకారం టీజర్ ఇచ్చేస్తే కాస్త కూల్ అవుతారు.. లేదంటే హీట్ వేవ్స్ నిజంగానే పెరుగుతాయి.