డియర్ సినిమా పీపుల్.. ఈ లాజిక్‌తో పనిచేస్తే.. మేజిక్ చేస్తారు..

కరోనా మహమ్మారి ఏమంటా వచ్చిందో కానీ ఎందరో ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు సినిమా రంగాన్ని కూడా చాలా దెబ్బతీసింది. ఆ సమయంలో వెంటిలేటర్ ఎక్కిన సినిమా తర్వాతి కాలంలో కాస్త బెటర్ అయ్యింది కానీ ఇంకా ఆక్సిజన్ మాస్క్ అయితే తీసుకోలేదు. కొన్ని సినిమాలు మాత్రమే చెలరేగి ఆడుతున్నాయి. మరికొన్ని సినిమాలు విడుదలవగానే డెత్ బెడ్ ఎక్కేస్తున్నాయి. ప్రేక్షకుడికి కావల్సిందేదో ఇవ్వడం లోపమా? టికెట్ ధరలా? ఒక సినిమా పతనానికి కారణాలు అన్వేషిస్తూ పోతే చాంతాడంత లిస్ట్ వస్తుంది. ఇవాళ సగటు ప్రేక్షకుడికి కావల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. ఏ జానర్ ఎంచుకుని ఇస్తారనేది సినిమా తీసే వారి ఇష్టం. నటీనటులను బట్టి సినిమాకు వచ్చే రోజులు పోయాయి. భారీ బడ్జెట్ అయినా.. సింపుల్ బడ్జెట్ అయినా మేకర్స్‌కి కావల్సింది రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలిగే సత్తా. ఒక సినిమా బతికితే నలుగురు బతుకుతారు. చచ్చిపోతే 96 మంది సమస్యల్లో పడతారు. ఎవరూ సమస్యల్లో పడకూడదు.. అంతా బాగుండాలనే Tagtelugu.com ఈ ఆర్టికల్.

అంపశయ్యపైకి సినిమాలు.. కారణమెవరు?

ఒకప్పుడు సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు సినిమా ప్రారంభం నాటి నుంచే బీభత్సమైన ప్రమోషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి. పెద్ద హీరో అయితే తప్ప జనం సినిమా గురించి ఆరా తీయడమే మానేశారు. దీనికి ఓటీటీ కూడా ఒక కారణం. ఎప్పుడు కుదిరితే అప్పుడు రిలాక్స్‌డ్‌గా ఇంట్లో కూర్చొని ఖర్చేమీ లేకుండా కుటుంబం మొత్తం ఎంజాయ్ చేయవచ్చనే భావన. సినిమా పెద్దదైనా.. చిన్నదైనా అద్భుతంగా ఉందనే టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. గతంలో మాదిరిగా టికెట్ ధరలున్నా.. థియేటర్‌లో ఏమైనా కొలుగోలు చేయగలిగే పరిస్థితి ఉన్నా ప్రేక్షకులు వచ్చి ఉండేవారేమో. ఇవన్నీ సినిమా పురోగతికి అవరోధాలేనన్న విషయం జగమెరిగిన సత్యమే. సినిమా విడుదలయ్యీ అవగానే అంపశయ్యపైకి చేరుతున్న సినిమాలకు కారణమెవరు? అనేది ఒక్కసారి మేకర్సే విశ్లేషించుకోవాలి.

రెండో రోజు నుంచే వెల వెల..

సినిమాకు ఆక్సీజన్ మాస్క్ తొలగించాలంటే రివ్యూయర్ వల్లో.. మరొకరి వల్లో కాదు.. ముందుగా చొరవ తీసుకుని మల్టీప్లెక్స్‌ల్లో సినిమా ధరలను అదుపు చేయాలి. పాప్‌కార్న్, చివరకు నీళ్లు కొనుగోలు చేయాలన్నా జేబు నుంచి పెద్ద నోటు తీసే పరిస్థితి పోవాలి. ఇది కూడా సినిమాకు మేజర్ అడ్డంకి. భారీ బడ్జెట్ సినిమా.. అద్భుతంగా ఉంది.. దానిని థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేయగలం అనుకుంటేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు. లేదంటే ఒక చిన్న కుటుంబం సినిమా చూడాలన్నా రూ.2 వేలు ఖర్చు చేయాలా? అన్న ఆలోచనతో వెనక్కి తగ్గుతున్నారు. ఈ ఏడాది విశ్వక్సేన్ ‘లైలా’ మూవీ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకుడిని రంజింపజేయలేకపోయింది. రెండోరోజు నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ వచ్చింది. అది కూడా మెప్పించలేకపోయింది. మరి ఈ సినిమాలు సరిగా ఆడలేదంటే లోపం ఎవరిది? ఇటీవలి కాలంలో రివ్యూయర్లను నిందించడం జరుగుతోంది. ‘ఓదెల 2‘, ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రాల విషయంలో రివ్యూయర్లపై విమర్శలొచ్చాయి.

ఆ శక్తి ఎవరికీ లేదు..

రివ్యూ అనేది కేవలం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అది చూసి జనాలు సినిమాకు రావడం ఆగుతారంటే.. సూర్యోదయానికి అరచేతిని అడ్డుపెట్టడమే అవుతుంది. మౌత్ టాక్ అనేది ఒకటుంటుంది. దాన్ని మించిన రివ్యూ మరొకటి లేదు. ‘పుష్ప’ విషయంలోనూ తొలుత రివ్యూలు రివర్సే వచ్చాయి. మౌత్ టాక్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసింది. సినిమాలో సత్తా ఉంటే ఏ రివ్యూలు అడ్డుకోలేవు. ఒక సినిమా చూశాక ఆ స్టోరీతో ఎన్ని సినిమాలొచ్చాయి. మ్యూజిక్ సొంతంగా చేశారా? లేదంటే ఎక్కడి నుంచైనా లేపేశారా? వంటి ఏ టు జెడ్ విషయాలు ప్రేక్షకుడు చెప్పగలుగుతున్నాడు. అంత అవగాహన ఉన్న ఒక ప్రేక్షకుడిని థియేటర్‌కు రాకుండా ఆపే శక్తి ఎవరికీ లేదు. రప్పించుకునే సత్తా మేకర్స్‌కు ఉండాలంతే. ‘డ్రాగన్’ సినిమా వచ్చింది. ఆ హీరో ఎవరనేది కూడా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ సినిమా మంచి సక్సెస్ సాధించింది. దీన్ని బట్టి చూస్తే.. హీరోహీరోయిన్, దర్శకనిర్మాతలతో పని లేదు. కేవలం సినిమా మెప్పిస్తోందా? లేదా? అనేదే ప్రశ్న. కాబట్టి ప్రేక్షకుడిని మెప్పించే సినిమా తీయండి. రివ్యూయర్ సినిమా బాగోలేదన్న పదం రాయాలన్నా భయపడే స్థాయిలో ఉండాలి. ఫలానా సినిమాలో చేశామని నటీనటులు, సాంకేతిక బృందం గొప్పగా చెప్పుకునేలా ఉంటే ఏ శక్తి సినిమాను ఆపలేదు.

నష్టమొస్తే భారం అందరిపై..

సినిమా సక్సెస్‌కు సోపానం.. కలిసికట్టుగా పనిచేయడం.. హీరోహీరోయిన్లు, టెక్నీషియన్ల భాగస్వామ్యం. ఇది ఉంటే సినిమా లాస్ అయినా ఇబ్బంది ఉండదు. భాగస్వామ్యం ఉంటేనే కదా సినిమా చేస్తారని అనుకోవచ్చు. నిర్మాణంలో భాగస్వామ్యం. ఒకరే రూ.100 పెట్టేకంటే.. అందరూ కలిసి పెడితే తలొక రూ.10 కాబట్టి ఎవరికీ పెద్దగా ఇబ్బంది అనిపించదు. లాభాలొస్తే సంతోషంగా అంతా పంచుకుంటారు. నష్టమొస్తే అందరి మీదా భారం పడుతుంది. అప్పుడు ఒక్కరే నష్ట భారాన్ని మోయాల్సిన అవసరం ఉండదు. తద్వారా మరో సినిమా తీయాలన్నా నిర్మాత జంకే పరిస్థితి ఉండదు. ఇప్పుడిప్పుడు కొన్ని సినిమాల విషయంలో ఈ మార్పు వస్తోంది. పూర్తిగా మార్పొస్తే ఇంకా బాగుంటుంది. నిర్మాత బాగుంటే కొన్ని వందల మంది బాగుంటారు. కాబట్టి మేమేం చెబుతున్నామంటే.. డియర్ సినిమా పీపుల్.. ఈ లాజిక్‌తో మేజిక్ చేసేయండి.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *