విడుదల తేది: 18-04-2025
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మిరాజు
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
విజయశాంతి, నందమూరి కల్యాణ్‌రామ్ తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ఇప్పటికే హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ సక్సెస్ సాధించాడు. ఇక విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.. లేడీ సూపర్‌స్టార్. మరి వీరిద్దరి కలయికలో సినిమా.. పైగా ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి మరోసారి తెరపై కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? కల్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా? ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి నటన నాటి రోజులను గుర్తు చేసిందా? చూద్దాం.
కథేంటంటే..
వైజయంతి (విజయశాంతి) ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్. కళ్ల ముందు తప్పు జరిగితే సహించదు. తన కొడుకు అర్జున్ (కల్యాణ్‌రామ్)ను సైతం ఐపీఎస్‌గా చూడాలని కలలు కంటుంది. అర్జున్‌కు తల్లంటే ప్రాణం. ఆమె పుట్టినరోజు వచ్చిందంటే అర్ధరాత్రి 12 గంటలకు విష్ చేయాల్సిందే. అలాంటి అర్జున్ తల్లి కోరిక మేరకు యూపీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించాడు. ఐపీఎస్ శిక్షణ పూర్తి కావడానికి వారం ముందు అనుకోని ఘటన జరుగుతుంది. ఆ ఘటన తల్లీకొడుకుల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుందనే అంశాలతో సినిమా రూపొందింది.
సినిమా ఎలా ఉందంటే..
తల్లిని అమితంగా ఇష్టపడే కొడుకు.. తప్పు చేసింది కొడుకైనా క్షమించని సిన్సియర్‌గా పోలీసాఫీసర్ అయిన తల్లి చుట్టూ దర్శకుడు అల్లిన కథ ఇది. రొటీన్ స్టోరీ. దానికి కొన్నియాక్షన్ ఎపిసోడ్స్ జోడించి వదిలారు. ఫుల్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అని చెప్పారు. వాస్తవానికి ఈ కథతో సినిమాలు చాలానే వచ్చాయి. కథలో అయితే కొత్తదనం లేదు. ఫస్టాఫ్ వరకూ కథ సాదాసీదాగా సాగుతుంది. ఇక సెకండాఫ్ వచ్చే వరకూ కొన్ని తల్లి అపోహలు తొలగిపోవడం.. కొడుకు కోసం ఆరాటపడటం వంటి అంశాలుంటాయి. క్లైమాక్స్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే సాగదీత, ఓవర్ డ్రమెటిక్ వంటి సన్నివేశాలు లేకుంటే క్లైమాక్స్ మరింత ఆకట్టుకునేది. ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా కేవలం తల్లీకొడుకుల సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రదీప్ చిలుకూరి సినిమాను లాగించేశారు. కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే..
ఎవరెలా చేశారంటే..
తల్లీకొడుకులుగా కల్యాణ్ రామ్, విజయశాంతిలు జీవించేశారు. యానిమల్ పృథ్వీరాజ్‌కు ఈ చిత్రంలో మంచి పాత్ర దక్కింది. ఆయన నటనకు సైతం నూటికి నూరు మార్కులు వేయొచ్చు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వలేదు. హీరోయిన్ ఉండాలన్నట్టుగా తీసుకున్నట్టే ఉంది. ఇక కమిషనర్‌గా శ్రీకాంత్ పాత్రలో ఒదిగిపోయారు. విలన్‌గా సొహైల్ ఖాన్ మెప్పించారు.
టెక్నికల్ పరంగా సినిమా ఎలా ఉంది?
బీజీఎం అయితే సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. ఇది మినహా సినిమాకు పెద్దగా టెక్నికల్ హంగులు అయితే ఏమీ లేవు. మ్యూజిక్, పాటలు ఆకట్టుకోలేకపోయాయి. స్క్రీన్‌ప్లే మరింత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ బాగుంది.
రేటింగ్: 2.5/5