సన్మాన కార్యక్రమంలో అందజేసిన తెలంగాణ ప్రభుత్వం
Padma Awards:
తెలంగాణ నుంచి ఈ ఏడాది పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున నగదు పురస్కారాలు
అందజేసింది. దీంతోపాటు ప్రతి నెలా వారికి రూ.25 వేల చొప్పున పెన్షన్ కూడా అందజేస్తున్నట్లు ప్రకటించింది. పద్మ అవార్డు గ్రహీతలకు
ఆదివారం పౌరసన్మానం చేసిన సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో
భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
వీరితోపాటు తెలంగాణకు చెందిన, వివిధ రంగాల్లో విశేష కృసి చేసిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల
విఠలాచార్యలకు పద్మశ్రీ పురస్కాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీరందరినీ సన్మానించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆదివారం
హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆ కార్యక్రమం నిర్వహించింది. వీరందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువా, మెమెంటోలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కళాకారులను సముచితంగా గౌరవించే
రాజ్యం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుందని అన్నారు. పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యానని తెలిసిన క్షణంలో చాలా సంతోషం కలిగిందని
అన్నారు. అభిమానుల ఆశీర్వాదం చూస్తుంటే తన జన్మధన్యమైనట్లు అనిపిస్తోందని అన్నారు. పద్మ పురస్కారాలు ప్రకటించిన తర్వాత కూడా
సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకూ ఎవరికీ రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ముందుకొచ్చి సన్మాన కార్యక్రమం ఏర్పాటు
చేయడం, పద్మ పురస్కారం అందుకోనున్న వారికి సముచితంగా గౌరవించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తెలిపారు.
గద్దర్ పేరుతో అవార్డులు ప్రశంసనీయం..
కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ కళాకారులకు నంది అవార్డులు ఇవ్వకపోవడంపై చిరంజీవి నిరుత్సాహం వ్యక్తం చేశారు. తాజాగా నంది
అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా, తెలుగు సినీ పరిశ్రమకు స్వర్గీయ
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్లలాంటి వారని, చిరంజీవి మూడో కన్ను లాంటి వారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. చిరంజీని
నట ప్రస్థానం అన్ని రంగాల వారికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో నేతలు మాట్లాడుతున్న భాష పట్ల ఆయన ఆందోళన
వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడేనేతలకు ‘పోలింగ్ బూత్’ లో సమాధానం చెప్పాలని, అలాంటి వారిని ఓడించడం ద్వారా బుద్ధి చెప్పాలని
సూచించారు. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.
Also Read :ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?