Parliament Elections in India:దేశంలో పదేళ్లుగా అప్రతిహతంగా పరిపాలన సాగిస్తోన్న ప్రధాని మోదీ మూడోసారీ
అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే, ఆయనకు విపక్షాలు గట్టి సవాలు విసురుతున్నాయి.
‘ఇండియా’ పేరిట కూటమి కట్టి.. బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నాయి.
దీనికితోడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఏకంగా భారత్ జోడో పేరిట యాత్రలు చేపట్టారు.
ఎన్నికలకు మూడు నెలలు ఉన్నాయనగా రెండో విడతనూ కొనసాగిస్తున్నారు.
అయితే, ఈ ప్రయత్నాలన్నిటికీ గండి కొడుతూ మరోసారి అధికారానికి మోదీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
చీలిక తెచ్చి..
సరిగ్గా మూడు నెలల కిందటి వరకు కూడా ఇండియా కూటమిలోని విపక్షాలు ఏకతాటిపై కనిపించాయి.
మరీ ముఖ్యంగా బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఆధ్వర్యంలో బలంగా ముందుకెళ్లేలా ప్రణాళికలు వేసుకున్నాయి.
కానీ, ఇప్పుడు ఏమైంది? వారం రోజుల్లో మొత్తం పరిస్థితి మారిపోయింది. నీతీశ్ ఏకంగా బీజేపీ (ఎన్డీఏ) గూటికి చేరిపోయారు.
బిహార్ లో కూటమి పార్టీని మార్చేశారు. దీనివెనుక మోదీ వ్యూహం ఉందనడంలో సందేహం లేదు.
మరీ ముఖ్యంగా నీతీశ్ కు ఇండియా కూటమి సారథ్యం దక్కని అంశాన్ని అడ్డుపెట్టుకుని ఆయనను ఆ కూటమి నుంచి బయటకు తెచ్చారు.
వాస్తవానికి ఇండియా కూటమికి పునాది వేసిందే నీతీశ్ కుమార్.
అలాంటివాడినే లాగేయడంతో ఆ కూటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్లయింది.
ఏ మాయ చేశారో..?
ఉత్తరప్రదేశ్ లో చాలా బలమైన నాయకురాలు మాయావతి. అంత పెద్ద రాష్ట్రంలో 2007లో సొంతంగా అధికారంలోకి వచ్చిన ఘనత ఆమె సొంతం.
అలాంటి మాయావతి భావ సారూప్యం కోసమైనా.. బీజేపీకి వ్యతిరేకంగా కట్టిన ఇండియా కూటమిలో భాగస్వామురాలు కావాలి.
కానీ, ఏం మాయ చేశారో కానీ.. మాయా మాత్రం ఇండియా కూటమికి కనీస మద్దతు కూడా తెలపడం లేదు.
గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ కూడా ఇండియాలో ఉన్నప్పటికీ..
మాయావతి ఈసారి అత్యంత కీలకమైన ఎన్నికల్లో దూరంగా ఉంటున్నారు.
జార్ఖండ్ లో దెబ్బకొట్టి.. ఢిల్లీలో చిచ్చుపెట్టి
జార్ఖండ్ లో గత ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించాయి కాంగ్రెస్-జేఎంఎం కూటమి.
అయితే, అప్పటినుంచి బీజేపీ కాచుకుని కూర్చుంది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన తప్పలను పట్టుకుని ఆయన్ను ఈడీ కేసుల్లో ఇరికించింది.
దీంతో హేమంత్ ఇప్పుడు పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
ఇక ఢిల్లీలో పదేళ్లుగా మోదీ కంట్లో నలుసుగా మారారు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్.
ఆయన తన పార్టీని పంజాబ్ కూ విస్తరించి అధికారం కైవసం చేసుకున్నారు.
గుజరాత్ లోనూ ప్రభావం చూపారు. అలాంటి కేజ్రీని ఢిల్లీ మద్యం విధానం కేసులో నానా తిప్పలు పెడుతోంది మోదీ సర్కారు.
ఇప్పుడు ఐదోసారీ ఈడీ విచారణకు వెళ్లలేదు కేజ్రీ.
దీంతో ఆయన అరెస్టు తప్పదనే ఊహాగానాలు వస్తున్నాయి.
మమతా, శరద్, అఖిలేశ్..Parliament Elections in India
పైకి ఇండియా కూటమిలోనే కనిపిస్తున్నటికీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్,
సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లకు వారివారి పరిమితులున్నాయి. అఖిలేశ్ ఇప్పటికే తన ఉద్దేశాలేమిటో చెప్పారు.
కాంగ్రెస్ కు 11 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వలేమని అంటున్నారు.
శారదా స్కాం కేసులో పార్టీ నేతలపై అభియోగాలున్న నేపథ్యంలో మమతా బెనర్జీ.. మోదీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో వెళతారని చెప్పలేం.
అందుకేనమో బెంగాల్ లో 2 సీట్లతో సరిపెట్టుకోమని తేల్చిచెబుతున్నారు.
ఇక అజిత్ పవార్ తిరుగుబాటు ద్వారా శరద్ పవార్ కోరలను నాలుగైదు నెలల కిందటే పీకేశారు.
అయితే, అజిత్ తో తిరుగుబాటు చేయించింది.. బీజేపీ కనుసన్నల్లోని మహారాష్ట్ర సర్కారులో చేరేలా చేసింది పెద్ద పవార్ అనే అంటారు.
అంటే.. శరద్ కూడా మోదీని పూర్తి స్థాయిలో ఎదిరిస్తారా? అంటే చెప్పలేని పరిస్థితి.
చివరకు చెప్పొచ్చేదేమంటే.. ఓవైపు అయోధ్య రామాలయం, కాశీ మసీదు వంటి అంశాలతో
భావోద్వేగాలను రెచ్చగొడుతూ మరోవైపు ప్రతిపక్షాలను చీల్చుతూ మూడోసారి అధికారంలోకి వచ్చే
ప్రయత్నం చేస్తున్నది మోదీ సారథ్యంలోని బీజేపీ. ప్రజల్లో పదేళ్ల పాలన పట్ల పెరిగిన వ్యతిరేకతను
తట్టుకుని మళ్లీ గెలవాలంటే ఈ తరహా ప్రయత్నమే సరైన మార్గమని భావిస్తోంది.
దీనిని ఓటర్లు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?