37 ఏళ్ల బ్రహ్మానందం కథ….
Brahmanandam Birthday special:
పుట్టిన ప్రతోడికి పేరుంటుంది…
సార్ధక నామధేయులు మాత్రం కొందరే..
అందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా చాలా ముఖ్యంగా
తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్న వ్యక్తి, శక్తి
డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందంగారు…ఆయన జీవితం..
జీవితంలోని కొన్ని అద్భుతమైన సంఘటనలు, టర్న్‌లు, ట్విస్టులు వీటన్నింటి సమాహారమే ‘నేను’ అనే పుస్తకం..
ప్రతేడాది పుట్టినరోజు అనగానే…
తెలియకుండానే ఈ ఏడాది ఏమి సాధించాం? అనుకుంటాం.
ఈ ఫిబ్రవరి ఒకటో తేది స్పెషల్ ఏంటంటే..
బ్రహ్మి ఇప్పటివరకు సాధించిన పుట్టినరోజలన్ని కట్టకట్టి
లెక్క పెట్టి ఇది ‘‘నేను’’ నేనుగా సంధించి సాధించుకున్నాను..
అని 321 పేజిల్లో తన జీవితాన్ని మడతపెట్టి ఏడవండి? నవ్వండి? ఏమైనా అనుకోండి? ఇదే సత్యం అని జీవితం
మొత్తాన్ని చెప్పి తన బర్త్‌డేకి ఈ ఏడాది ఎంతో స్పెషల్ అంటూ
తన ఫ్యాన్స్‌కి తనను చూసి నవ్వే ప్రతివారికి గిఫ్ట్ ఇచ్చారు…
ఇక చదవండి..
బ్రతకటానికి కావలిసిన జీవిత పాఠాలన్ని ఆ పుస్తకంలో
నేటితో 68 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్రహ్మానందం. ఈ పుట్టినరోజు వరకు బ్రహ్మానందం తన నటనతో లెక్కలేనన్ని అవార్డులు రివార్డులు
సాధించిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవన్నీ ఒకెత్తయితే బ్రహ్మానందం స్వయంగా రచించిన ‘‘నేను’’ అనే పుస్తకం ఒకెత్తు.
ఆ పుస్తకంలో ఆయన చేసిన కలం సేధ్యం గురించి ఖచ్చితంగా చెప్పుకు తీరాల్సిందే. ‘నేను’ చదువుతున్నప్పుడు బ్రహ్మానందం జీవితానికి
సంబంధించిన నవరసాలు కళ్లముందు కదలాడుతాడుతాయంటే అతిశయోక్తి కాదేమో. బ్రతకటానికి కావలిసిన జీవిత పాఠాలన్ని
ఆ పుస్తకంలో ఉన్నాయి. తెలుగు వారికి బ్రహ్మ ఇచ్చిన ఆనందవరం బ్రహ్మానందం. ఆయన పుట్టినరోజు సందర్భంగా సరదాగా ఓ చిన్న కధ…
కామెడిగా ఓ చిన్న కథ చెప్తాను…నవ్వుతూ, సరదాగా.. ఊ..కొట్టండి..
ఎక్కడ చూసినా ఎప్పుడుఉండే కష్టాలే
అది 1955వ సంవత్సరం ఏప్రిల్ నెల తెల్లవారుజాము నాలుగ్గంటలు….టిక్….టిక్…టిక్.. హెచ్‌యమ్‌టి గోడ గడియారం తనపని తాను చేసుకుపోతూ
ఉంది. అప్పటికే స్వాతంత్య్రం వచ్చి 8 ఏళ్లయింది. అయినా బ్రిటిష్‌వారు వదిలివెళ్లినా బాధకరమైన గుర్తులు ఇంకా పూర్తిగా మానలేదనే చెప్పాలి.
ఎవరి మనసులోకెళ్లి తొంగిచూసినా ఏ నోట విన్నా స్వరాజ్యం వచ్చి అప్పుడే ఎనిమిదేళ్లు కావస్తుంది. కానీ ఇంకా మనమంతా మానసిక ఆనందానికి
నోచుకోలేదే అనే కుమిలిపాటు లోలోపల అందరిలోను ఉంది. ఆ సమయంలో ప్రజలందరూ కలిసి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఓ
కోరిక కోరారు. ఓ త్రిముర్తూల్లారా! మా మనవి ఆలకించండి… మా పెద్దవాళ్లు ఎన్నో త్యాగాలు చేసి. మరెన్నో బలిదానాలు పొందితేకానీ, భారతదేశానికి
పట్టిన తెల్లవాడి పీడ తొలగిపోయింది. స్వతంత్రులము అయ్యాము. స్వాతంత్రులము అయ్యామో లేదో తెలియడం లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు
ఉండే కష్టాలే. సరైన ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏంటో బొత్తిగా అంతు చిక్కకుండా ఉంది. మా బాధలన్నీ పోయి, కష్టాలను మరచే ఉపాయం
ఏదన్నా సెలవివ్వండి స్వామి అని తెలుగు రాష్ట్రాల్లోని భక్తులందరూ సమావేశమై ఆ దేవదేవులను వేడుకున్నారు. అప్పుడు భక్తుల కష్టాలన్నీ విన్న
ముగ్గురు దేవుళ్లు ఇమ్మిడియేట్‌గా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ముచ్చటగా ముచ్చటి పెట్టారు. సరే మన భక్త జనం అంతా
మూకుమ్మడిగా కూర్చుని మనం ఉన్నామనుకుని వాళ్లకొచ్చిన సమస్యల గురించి గోడు వెళ్లబోసుకుంటున్నారు.వాళ్లు కోరిన కోర్కెలు మన
త్రిమూర్తులకు సమస్యలొచ్చేంత పెద్ద కోరికలేం కావు. మహా అయితే మనల్ని ఏమని అడుగుతున్నారు! కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వమనేగా
కోరుతున్నారు. ఇస్తే పోలా…అన్నాడు విష్ణు. దానికి వెంటనే శివుడు పూనకం వచ్చినవాడులాగా ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే నేను… విష్ణు.
ప్రస్తుతం బడ్టెట్ కూడా అంతంత మాత్రంగానే
బ్రహ్మ ఓ మాట అనుకుని చెప్పండి. ఈ సమస్యకు పరిష్కారం నేనే. మీరేం చేయ్యమంటే అది నేను ఐదంటే ఐదు నిమిషాల్లో చేసి చూపించి మన
భక్తులందరిని నవ్వుకునేలా చేస్తాను అన్నాడు. దానికి వెంటనే ఉలిక్కిపడిన బ్రహ్మదేవుడు, శివుని వైపు చూసి మీరెంతో గొప్పవారు. అనేకసార్లు
ఎంతోమంది రాక్షసులకు వరాలిచ్చి మిమ్మల్ని మీరు కోల్పోయో పరిస్థితి ఎన్నిమార్లు వచ్చిందో గుర్తుందా. అప్పుడు మీ జాడకోసం నేను, విష్ణు
మంచుకొండలు, గుట్టలు ఎక్కి దిగి మా నడుములు పడిపోయాయి. అంతటితో ఆగకుండా మీ శ్రీమతి మా ఆయన కనపడటంలేదని మా మీద
సీరియస్ అవుతుంది. అది కాక నిన్ను వెతికే క్రమంలో చాలా డబ్బులు వృధా. ప్రస్తుతం బడ్టెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నోసార్లు
మీ జాడ తెలియక మేము కష్టపడ్డాం. అలాగే శ్రీమహా విష్ణువు దశావతారాల్లో కనిపించి భక్తుల పాలిట ఆపద మొక్కులవాడయ్యాడు. ఆయన
వెంకటేశ్వరుని అవతారంలో వెళ్లి పెళ్లికోసం తీసుకున్న అప్పుకు ఇప్పటికి వడ్డీలు కడుతున్నాం. అందుకే బడ్జెట్ లేని కారణంగా హరిహరాదులు
ఇద్దరూ కూడా నా మాట మీద గౌరవం ఉంచి నేను చెప్పినట్లు వింటాను అంటే ఖర్చులేకుండా నేనొక సలహా ఇస్తాను అన్నాడు. ఏంటి ఈ బ్రహ్మ !
మనిద్దరం ఇంత తోపులుండగా ఈయన సలహా ఇస్తానంటున్నాడు. మనకేమన్నా తెలివి తక్కువ, ఫ్యాన్స్ తక్కువ, ఈ నాలుగు తలలవాడి మాట
మనం వినాలా! అని తన మూడోకన్నుని పెద్దగా చేసి మరి విష్ణువుతో గుసగుసగా అన్నాడు భోళాశంకరుడు. శంకరుని కోపం ఎటువైపు నుండి
ఎటువైపు వెళుతుందో, ఎందుకొచ్చిన గొడవ సమస్యను ఇంతటితో కట్ చేద్దామని మనసులో అనుకున్నాడు విష్ణు. అసలే ఈ రోజు ఏప్రిల్ ఒకటో
తారీఖు, ఇంటికెళ్లి మా ఆవిడని ఫూల్ చేయాలి, లేదంటే నాకంటే ఆమె గొప్పదనుకుంటుంది అనుకుని మ్యాటర్‌ని స్మూత్‌గా డీల్ చేద్దాం శివయ్య.
ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అతనే అనుకునేలా ఉంటాడు
ఎప్పుడూ సమస్యల్లో పెద్దగా తలదూర్చని బ్రహ్మే తనంతట తానుగా వచ్చి సమస్యకు పరిష్కారం చెప్తా అంటున్నాడుగా. విందాం మనకి
పోయేదేముంది అన్నాడు శివునివైపు లౌక్యంగా చూస్తూ విష్ణు. అది విన్న వెంటనే శివుడు కూడా నిజమే కదా మనకెందుకొచ్చిన గొడవ ఈ బ్రహ్మ ఏం
చెప్తాడో, ఏం చేస్తాడో చూద్దాం అనుకుని సరే బ్రహ్మ మేమిద్దరం ఈ సారికి నీ మాట విని సరే అంటున్నాం. కానీ, ఈ సమస్యకు ఏ విధంగా
పరిష్కరిస్తావో ఓ సారి మా ఇద్దరికి చెప్పు. నీవు చెప్పినది మా ఇద్దరికి సమ్మతమైతే నువ్వు చెప్పిన మాటకి సరే అనుకుని ఎవరి దారిన వారు
వెళ్లిపోతాం. లేదంటే, మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సమస్యను మా స్టైల్లో పరిష్కరిస్తాం అన్నారు. దానికి సరే అన్న బ్రహ్మ ఇదుగో చూడంyì బాస్
నేను సూచించే ప్రక్రియలో ప్రజలందరూ తరతరాలు చెప్పుకుని నవ్వుతూనే ఉంటారు అన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్
అతనే అనుకునేలా ఉంటాడు. మీరు ఓకే అంటే ఇప్పుడే అతని జన్మస్థానాన్ని ధ్రువీకరిస్తాను అన్నాడు బ్రహ్మ. ఒకరినొకరు చూసుకున్న శివుడు,
విష్ణుమూర్తి సరే అనుకుని మీరు సృష్టించే ఈ మానవుడు ఏ రాజ వంశానికి చెందినవాడు, ఎలాంటి మంత్ర విద్యలు తెలిసిన వాడు, ప్రపంచంలోని
అందగత్తెలందరూ మనసు పారేసుకునే మన్మధునివంటి అందగాడా? ఆరడుగుల ఆజానుబాహుడా మీరిప్పుడే చెప్పాలి? అని బ్రహ్మని నిలదీశారు.
ఇతన్ని చూడగానే ప్రజలందరూ నవ్వుతూనే
బ్రహ్మ వీళ్లిద్దరిని దగ్గరకి పిలిచి రైట్‌సైడ్ తలతో విష్ణువుకి, ఫ్ట్‌సైడ్ తలతో శివునికి సమాధానం చెప్పాడు. మీరు అడిగిన సమస్యకు పరిష్కారం
చూపిద్దామనుకున్నాను, కానీ మీరడిగిన బ్రహ్మాండాలను నేనివ్వను. ఈ క్వాలిటీస్ అన్ని లేకపోయినా క్వాలిటీ కామెడీని పండించేవాడిని ప్రజలకు
సరైన ఎంటర్‌టైన్‌మెంట్ అందించేవాడిని ఇప్పుడే ఈ క్షణమే బ్రహ్మ ముహూర్తంలో భూమ్మీదకు పంపుతున్నాను అని పరమశివునికి, శ్రీ
మహావిష్ణువుకి మాటిచ్చాడు. రైట్ సైడ్‌లో ఉన్న విష్ణును, లెఫ్ట్‌లో ఉన్న శివుణ్ని ఎదురుగా ఉన్న మొఖం దగ్గరికి పిలిచి అసలు విషయం చెప్పాడు
బ్రహ్మ. ఇతన్ని చూడగానే ప్రజలందరూ నవ్వుతూనే ఉంటారు. ఆయన అరగుండుతో ఉండే రూపం అయినప్పటికీ, పెద్ద పొడగరి కానప్పటికి,
ఆయనో ఉద్దండ పిండం. సరిగ్గా 1987లో అతని జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. అప్పటినుండి అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరాలు
ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటారు. తెరమీద ఆయన కనపడగానే తెలియకుండా నవ్వుతూనే ఉంటారు. అంత గొప్ప నటుణ్ని ఈ రోజు నేను
ప్రజలకు అందిస్తున్నాను. ఇంతమంది భక్తులు కోరిన కోరికలు నేను తీరుస్తున్నాను కాబట్టి అతనికి నా పేరు బ్రహ్మతో పాటు ప్రజలకు ఆనందాన్ని
పరిపూర్ణంగా అందిస్థాడు కాబట్టి బ్రహ్మనందం అని నామకరణం చేస్తున్నాను అని బ్రహ్మ సెలవు తీసుకున్నాడు. కరెక్ట్‌గా పదంటే పది నెలల్లో 1956
ఫిబ్రవరి ఒకటో తేదిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గరిలో ఉన్న పల్లెటూర్లో నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు
బ్రహ్మానందం. బంగార వృత్తిలో ఉండే కులంలో పుట్టి బంగారం అంటే తెలియనంత దరిద్రంలో పెరిగిన బ్రహ్మనందం తర్వాత చదువుకుని
లెక్చరర్‌గా పనిచేశారు. 1987లో సరిగా తనకు ముప్పై ఏళ్లు నిండేనాటికి ‘‘అహనా పెళ్లంట’’ అంటూ తెరంగేట్రం చేసి నేనొచ్చానంటూ కేక్ కట్
చేశాడు.. అప్పటినుండి ఆయన ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో నవ్వుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. బ్రహ్మ ఆ రోజు బ్రహ్మనందాన్ని
హరిహరాదులకు చూపించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను చూడండి అన్నాడు గర్వంగా. ఇతను నా భక్తులకు నేనిచ్చిన వరం అని
చెప్పాడు…నేడు నవ్వుల టానిక్ బ్రహ్మి పుట్టినరోజు. హ్యాపీ బర్త్‌డే టు బ్రహ్మానందం గారు…..
ప్రేమతో శివమల్లాల
ట్యాగ్‌తెలుగు. కామ్
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?
Also Watch:Brahmanandam Autobiography Book Review | Brahmanandam Birthday Special