Ramoji Rao :
మన ఇళ్లల్లో ఏం ఉన్నా లేకపోయినా దేవుని ఫోటోలు ఖచ్చితంగా ఉంటాయి. ఆనందంగా ఉన్నప్పుడో బాగా బాధగా ఉన్నప్పుడో దేవుని ముందుకు వెళ్లి ఒక నిమిషం మౌనంగా దణ్ణం పెట్టుకుంటాం.
కానీ ఆయన దేవుడు కాకపోయినా చాలామంది ఇళ్లల్లో ఆయన ఫోటోలు ఉంటాయి. ఆయనే మార్గదర్శి పెట్టిన మధ్య తరగతి మార్గదర్శకుడు.
ఈనాడు పేపర్‌లో విప్లవాలు, సంచలనాలు సృష్టించి తెలుగువారికి నాలెడ్ట్‌ను పెంచిన మీడియా టీచర్.
ప్రియా పచ్చళ్లు అంటూ బ్యాచిలర్స్ నోటికి షడ్రుచులు అందించిన నలుడు. కళాంజలి అంటూ ఆడపడుచులకు దగ్గరయ్యారు.
ఫిలింసిటీని కట్టి హైదరాబాద్ అంటే చూడటానికి చార్మినారే కాదు…ఫిలింసిటీ కూడా అని చెప్పిన ఇంజనీర్ అతను.
ఈ టీవి మీ టీవి అంటూ 8 బాషల్లో టీవిని పెట్టి ఠీవిగా ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంజాయ్ చేయండి అంటూ టీవి చూసే ప్రేక్షకులకు ఎంటర్‌టైనర్ ఆయన.
ఇవే కాకుండా తాను ఏ రంగంలో వ్యాపారం చేసిన వ్యాపారానికే వన్నే తీసుకువచ్చిన బిజినెస్ టైకూన్ ఆయన. ఆయనే 88 సంవత్సరాల తెలుగు జాతి గర్వించే చెరుకూరి రామయ్య వరుఫ్ సి.హెచ్ రామోజిరావు.
రాజకీయ చదరంగంలో తాను ఎత్తు వేస్తే రాష్ట్రాలనుండి దేశం దాకా ఎవరైనా ఆ ఎత్తుకు చిత్తవ్వాల్సిందే. అంతటి మేధోశక్తి ఆయన సొంతం.
ఏ చుట్టరికం లేకుండా దేవునిలా ఆయన ఫోటోని ఫీలవుతూ ఇంటి హాల్లో పెట్టుకుని ప్రతిరోజూ ఆయన్ను ఎంతో మురిపెంగా చూసుకునే కొన్ని వేల కుటంబాలు ఈ రోజు వరకు దండలు కొనుక్కునే అవసరం రాలేదు.
రోజుకి ఒకసారైనా ఆయన ఫోటోను చూసుకుని మా బాస్ అంటూ మురిపెంగా మనసులోనే దణ్ణం పెట్టుకుంటారు తనద్వారా అవకాశాల్ని పొందిన ఎందరో.
అలాంటి ఎన్నో వేల టాలెంటెడ్ కుటుంబాల వారు ఈ రోజు నుండి ఆ ఫోటోకి దండలు కొనే అవసరం రావటం ఎంతో బాధాకరం.
ఆయన ద్వారా ఆయన సంస్థల ద్వారా గుర్తింపబడి తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపెట్టి పెద్దవారైన ఎంతోమంది మేము ఈ రోజులో ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం రామోజిరావు గారే అంటుంటారందరూ.
ఆయన మా గెలుపుకి స్వయంగా పిల్లర్‌లా నిలుచున్నారని చెప్పే సినిమావాళ్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లు, సింగర్స్ ఇలా ఎందరున్నారో లెక్కేలేదు.
రామోజి కుటుంబమంటే నలుగురు కాదు. ప్రపంచ నలుచెరగులా ఉన్నవాళ్లు. వారందరూ అశ్రు నయనాలతో బాధ పడవలసిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయన పేరును కీర్తిని కలకాలం గుర్తుండేలా చేయటానికి ప్రపంచమంతా మీరున్నారని ఆ పెద్దాయనకు తెలుసు. అందుకే తన మేధో శక్తిని ఆదర్శంగా తీసుకుని చాలామంది వివిధ రంగాల్లో రాణించారు, రాణిస్తున్నారు.
వారందరూ రామోజిరావు గారికి ఏకలవ్య శిష్యులే. ఏకలవ్య శిష్యులు గొప్పగా రాణించి విజయం సాధించిన ప్రతిసారి రామోజిగారు మళ్లీ బ్రతికి వస్తారు.
ఇప్పుడు ఈ భూమ్మీదనుండి రామయ్య శరీరం మాత్రమే వెళ్లిపోతుంది. ఆయన మాత్రం తెలుగువారందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండే పద్మవిభూషణుడు…
ఇక సెలవు గురువుగారు…..
మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ….
మిమ్మల్ని చూస్తూ మీ ద్వారా ఎంతోకొంత జ్ఞానాన్ని పొందిన శివమల్లాల
Also Read This Article : దేవుడంటే రాముడు.. భార్య భర్తలంటే సీతారామలు..