Nandi Awards : తెలంగాణాలో మళ్ళీ నంది అవార్డులు

Nandi Awards :

తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ నంది అవార్డులు సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులకు నంది అవార్డులు అందజేసే విషయాన్ని పరిశీలించాలని తెలంగాణ కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలోనే దీనిపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా ప్రకటించారు.

ఇప్పుడే కాదు.. ఇటీవల సీనియర్ నటుడు మురళీమోహన్ ను ఓ ప్రైవేటు సంస్థ వారు సత్కరించిన సందర్భంగా ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనప్పుడు కూడా మంత్రి కోమటిరెడ్డి నంది అవార్డుల విషయాన్ని ప్రస్తావించారు.

త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి.. నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

ఆ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించి పలు సమస్యలను మురళీమోహన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటన్నింటిపైనా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.

అన్నట్లుగానే ఈ నెల 20వ తేదీన సమీక్ష నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి.. నంది అవార్డులతోపాటు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపైనా అధికారులతో చర్చించారు.

త్వరలోనే అన్ని సమస్యలకూ పరిష్కారం చూపిస్తామని అన్నారు. దీంతో సినీ కళాకారులు, సాంకేతిక నిపుణుల్లో నంది అవార్డులపై ఆశలు చిగురిస్తున్నాయి.

తెలుగుదేశం ప్రభుత్వాధినేత నందమూరి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల పురస్కాలను సినీ పరిశ్రమ ఒక పండుగలా జరుపుకొనేది.

కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, నేదురుమలిల జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలతోపాటు తెలుగుదేశం ప్రభుత్వాధినేత నందమూరి తారక రామారావు,

ఆ తరువాత చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ప్రతి ఏటా నంది అవార్డులను అందజేశారు.

అవార్డుల ఎంపికలో పక్షపాతం, వివక్ష వంటి ఆరోపణలు కూడా వచ్చినా.. పురస్కారాల ప్రదానంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించారు.

కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక.. ఈ అవార్డులకు గ్రహణం పట్టింది.

రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు సినీ పరిశ్రమ ఉండగా.. ఎవరికి వారే నంది అవార్డులను అందజేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.

అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పేరుతోనే పురస్కారాలను కొనసాగించగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నంది స్థానంలో కాకతీయ అవార్డుల పేరుతో ‘సింహం’ ప్రతిమలను ఇవ్వాలన్న ప్రతిపాదన చేసింది.

కానీ, ఏం జరిగిందో ఏమోగానీ.. అది కార్యరూపం దాల్చలేదు.

మరోవైపు విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా 2014లో ఎన్నికైన చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో 2016 వరకు నంది అవార్డులను అందజేశారు.

కానీ, ఆ తరువాత అవి కూడా ఆగిపోయాయి. 2019లో ప్రభుత్వం మారిపోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు.

తెలంగాణలో ఇటీవలే ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ ఓటమిపాలై.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నంది అవార్డుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

సినీ పరిశ్రమలో మెజారిటీగా ఉన్నవారంతా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే అయినా.. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి టీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల వ్యతిరేక భావన కలిగి ఉన్నా..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక వారి పట్ల కేసీఆర్ ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరించడంతో పరిశ్రమ చాలా వరకు నేటి బీఆర్ఎస్ కు అనుకూలంగానే మారింది.

ఇటీవలి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని సీట్లనూ బీఆర్ఎస్ గెలుచుకోవడం, గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించడంలో సినీ పరిశ్రమకు చెందిన వారి సహకారం కూడా ఉందన్న అభిప్రాయాలున్నాయి.

ఈ నేపథ్యంలో వారి అభిమానాన్ని చూరగొని తమవైపు తిప్పుకోవాలనే యోచనలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.

అందుకు మొదటి అడుగుగా నంది అవార్డులను అందజేసే యోచనలో ఉంది. అయితే వారి ఉద్దేశాలు ఏమైనా.. నంది అవార్డులు ఇస్తే మాత్రం సినీ పరిశ్రమకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్లేనని చెప్పుకోవచ్చు.

 

Also Read :  ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ తీసుకుంటున్నారా ?

 

Srinivas Gavireddy Interview
Srinivas Gavireddy Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *