100 days ordeal for Congress:తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించేందుకు ప్రజలు అవకాశమిచ్చిన కాంగ్రెస్ పార్టీకి..
100 రోజులకే అగ్నిపరీక్ష ఎదురు కాబోతోంది. ఐదేళ్లు పాలించేందుకు తాము అర్హులమేనని ఆ పార్టీ నేతలు
నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తబోతోంది. ఔను.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీల
పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు గడువును 100 రోజులుగా చెప్పడమే ఇందుకు కారణం. సాధారణంగానైతే
రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కొంత ఆలస్యంగానైనా నెరవేర్చేందుకు వీలుంటుంది.
ఎలాగూ ఎన్నికలు ముగిసినందుకు ప్రజలు కూడా ఏమీ చేయలేరనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే మరికొద్ది రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికలు జరగనుండడంతో ఈసారి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్
సర్కారుకు అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. వారు చెప్పినట్లుగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు
చేయలేకపోతే.. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఇది ప్రధానాస్త్రం అవుతుంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు
పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా దాదాపుగా కాంగ్రెస్ పెట్టుకున్న 100 రోజుల గడువు సమయానికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి మార్చి 17తో వంద రోజులు పూర్తవుతుండగా.. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ ను
కూడా దాదాపుగా అదే సమయంలో విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం
ఫిబ్రవరిలోనే షెడ్యూలు విడుదల చేసే యోచనలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ
సూచనల మేరకే ఈ దిశగా ఈసీ అడుగులు వేస్తోందన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయోధ్యలో రామమందిర
ప్రాణప్రతిష్ఠ జరగడం, దేశమంతా దీనిని పండుగలా నిర్వహించుకుంటుండడంతో.. ప్రజల్లో ఈ ఊపు తగ్గకముందే ఎన్నికలకు
వెళ్లాలనే యోచనలో ప్రధాని మోదీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల నాటికి తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు
చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పట్ల ప్రజలు తమ ఉద్దేశాన్ని ఎన్నికల్లో స్పష్టం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వంద
రోజుల నాటికి హామీలను అమలు చేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్ సర్కారు నిమగ్నమై ఉంది.
ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలకు చెల్లించే
మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంపు హామీలను రేవంత్ సర్కారు అమలు చేస్తోంది. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం
హామీని అమలు చేసేందుకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోవడం. ఉన్న బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి
అవకాశం కల్పించే వీలుండడంతో ఒక్క సంతకంతో దీనిని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ విషయంలోనూ..
ఆస్పత్రులకు బిల్లులు చెల్లించేందుకు సమయం ఉండే వీలుండడంతో ఈ రెండు హామీలను వెంటనే అమల్లోకి తెచ్చారు.
మిగిలిన నాలుగు గ్యారంటీలు అమలు చేయాలంటే మాత్రం సర్కారు ఉన్నపళంగా ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థతి ఎదురవుతుంది.
కానీ, ఇప్పటి ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవడం, అప్పు తెచ్చకునేందుకు నిబంధనలు అడ్డు వస్తండడంతో ఏంచేయాలో పాలుపోని
పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇది 100 రోజుల అగ్నిపరీక్షే కానుంది.