UP Congress :
రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్
లోక్ సభ ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ
గాంధీ కుటుంబానికి దశాబ్దాల తరబడి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ నియోజకవర్గంతో బంధం తెగిపోయింది.
అవును.. అమేథీ నుంచి గాంధీ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయడంలేదు.
2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలైన రాహుల్.. ఆ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి అక్కడి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.
తిరిగి ఈసారి కూడా వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్.. మరోసారి అమేథీ నుంచి పోటీకి మాత్రం వెనకడుగు వేశారు.
గత ఎన్నికల దాకా తన తల్లి సోనియాగాంధీ గెలుస్తూ వచ్చిన రాయ్ బరేలీ నుంచి రాహుల్ నామినేషన్ వేశారు. సోనియాగాంధీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగి… రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆమె స్థానంలో రాయ్ బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగుతారని అందరూ భావించారు. రాయ్ బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే లోతుగా చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దించుతూ, అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు అయిన కిశోరిలాల్ శర్మ పేరును హైకమాండ్ ప్రకటించింది. ఈ ఉదయం వీరి పేర్లను అధికారికంగా డిక్లేర్ చేసింది. అయితే అమేథీ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు వైదొలగడం ఆసక్తికర అంశంగా మారింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ప్రియాంకాగాంధీ దూరంగా ఉంటున్నారు. రాహుల్, కిషోరి లాల్ శర్మ ఇద్దరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు.
కంచుకోటే.. కానీ
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. రెండు సార్లు ఇతర పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1980 నుంచి అమేథితో గాంధీ కుటుంబానికి విడదీయరాని బంధం ఏర్పడింది. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ పోటీ చేసి, గెలుపొందారు. సంజయ్ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ పోటీ చేశారు. అప్పటి నుంచి రాజీవ్ గాంధీ అమేథి నుంచి బరిలోకి దిగారు. 1984, 1989, 1991లో వరసగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 1991లో రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత కాంగ్రెస్ నేత సతీష్ శర్మ1991 ఉప ఎన్నిక, 1996 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. 1999 నుంచి రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ బరిలోకి దిగారు. 2004లో కుమారుడు రాహుల్ గాంధీ కోసం సీటును త్యాగం చేశారు. 2009, 2014లో రాహుల్ గాంధీ గెలుపొంది, హ్యాట్రిక్ కొట్టారు. 2019లో మాత్రం స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. మరోసారి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ అంగీకరించలేదు. దాంతో కిశోర్ శర్మకు టికెట్ దక్కింది.
Also Read This Article : ఇది కదా.. సేవ అంటే!
