Balakrishna :
నందమూరి కుటుంబ వ్యవహారాలు మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి రోజు చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ఇందుకు కారణమైంది.
ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 18న ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించిన క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించాలంటూ
నందమూరి బాలకృష్ణ తన అనుచరులను ఆదేశించడం వివాదానికి దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలను బాలకృష్ణ సహించలేకపోతున్నారని,
జూనియర్ ను ఇలాగే వదిలేస్తే రాజకీయపరంగా కూడా తమకు ఇబ్బందులు వస్తాయని బాలయ్య భావిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
వైసీపీ నేత, జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడైన మాజీ మంత్రి కొడాలి నాని ఈ విషయంలో తనదైన శైలిలో స్పందించారు.
బాలకృష్ణపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎప్పటిలాగే ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి అయితే..
టీడీపీకి వారసుడు జూనియర్ ఎన్టీఆరేనని, మిగతా కుటుంబసభ్యులెవరూ కాదని తేల్చేశారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుదలలో బాలకృష్ణకు
ఎటువంటి పాత్ర లేదని, ఆయన ఎక్కడ ప్లెక్సీలు పెట్టుకోవాలో, ఎక్కడ పెట్టవద్దో చెప్పే హక్కు బాలయ్యకు లేదని ఫైర్ బ్రాండ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టీవీ చానళ్లు కూడా రోజంతా ఇదే అంశంపై చర్చ పెట్టాయి.
దీంతో నందమూరి కుటుంబంలో, టీడీపీలో ఏం జరుగుతోందన్న చర్చ అంతటా మొదలైంది.
ఐ డోంట్ కేర్
వాస్తవానికి అటు ఏపీలో అధికారానికి దూరమై, ఇటు తెలంగాణలో ఉనికి కోల్పోయి.. టీడీపీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది.
రానున్న ఎన్నికల్లో ఏపీలో పార్టీలో తిరిగి అదికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, అధికార వైసీపీ దూకుడు, ఆ పార్టీలోని కొందరు నేతల నోటిదురుసుతో చంద్రబాబు కుటుంబం నైతికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన గానీ, నైతిక మద్దతు గానీ లభించలేదు.
చివరికి జగన్ సర్కారు.. చంద్రబాబుపై పలు కేసులు పెట్టి జైలుకు కూడా పంపినా కుటుంబ సభ్యుడిగా జూనియర్ నోరు కూడా మెదపలేదు.
ప్రపంచ, వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపైకి వస్తే జూనియర్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
చంద్రబాబును దూషించే కొడాలి నాని వంటి వారితో స్నేహాన్ని కొనసాగించారు. ఇవన్నీ టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయి.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, వర్సెస్ టీడీపీ కార్యకర్తలు అన్నట్లుగా పరిస్థితి
ఎప్పుడో మారిపోయింది. పైగా జూనియర్ స్పందించకపోయినా ‘ఐ డోంట్ కేర్’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఆజ్యం పోసింది.
నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడే దిశగా పరిస్థితులు మారాయి.
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒకవైపు నిలిస్తే.. మిగిలిన కుటుంబమంతా మరోవైపు ఉందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి.
తాజాగా చోటుచేసుకున్న ప్లెక్సీ వివాదం దీనిని మరింత బలంగా చాటింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని కాదని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల్ని ఆయన వ్యతిరేకులు చేస్తున్నారు.
దీంతో ఇది చినికి చినికి గాలివానగా మారి.. రానున్న ఎన్నికల్లో టీడీపీ అవకాశాలకు గండి కొడుతుందా.. అన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొందనే ప్రచారం జరుగుతోంది.
తాజా వివాదానికి కారణమైన ప్లెక్సీల వ్యవహారంలో మాత్రం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరి తప్పూ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వర్ధంతి రోజున నివాళులర్పించాల్సిన చోట.. స్వాగతం-సుస్వాగతం అంటూ ప్లెక్సీలు పెట్టడం సమంజనం కాదన్న ఉద్దేశంతోనే వాటిని తొలగించాల్సిందిగా బాలకృష్ణ సూచించి ఉంటారని ఆయన అనుకూలురు చెబుతున్నారు.
మరోవైపు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని అభిమానులకు చెప్పి ఉండరని జూనియర్ కు సంబంధించిన వారు అంటున్నారు.
అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వీటిని ఏర్పాటు చేసి ఉండవచ్చని, దీనికి జూనియర్ కు సంబంధం ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు.
కానీ, దీనిపై ఇప్పటిదాకా జూనియర్ మాత్రం స్పందించలేదు. ఏదేమైనా.. ఈ ఘటనలు టీడీపీలో, నందమూరి కుటుంబంలో అభిప్రాయ బేధాలను మాత్రం స్పష్టంగా బయటపెట్టాయి.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?
