Madhavi Latha News :
క్షమాపణతో సమసిపోతుందా?
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత వివాదంలో ఇరుక్కున్నారు. శ్రీరామ నవమి నాడు సీతారాముల శోభాయాత్ర సందర్భంగా ఆమె చేసిన ఓ అభినయం వివాదానికి దారితీసింది.
ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తూ మాధవీలత చేస్తున్న వ్యాఖ్యలకు, ప్రచార తీరుకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే.
ఒకే ఒక్క జాతీయ స్థాయి ఇంటర్వ్యూతో ఆమె ఇటీవల ప్రధాని మోదీ దృష్టిని కూడా ఆకర్షించారు. అయితే, ఆ ఉత్సాహమో, లేక ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు చూపించిన ఉత్సాహంతోనే గానీ.. ఈ శోభాయాత్ర సందర్భంగా విల్లుతో బాణం వదిలినట్లుగా మాధవీలత అభినయించారు.
అయితే అక్కడి ప్రదేశంలో ఆమెకు ఎదురుగానే మసీదు ఉంది. దీంతో ఆమె ఆ మసీదునే లక్ష్యంగా చేసుకొని అలా బాణం వదిలిందన్న అభిప్రాయం వచ్చేలా వీడియోలో కనిపిస్తోంది. ఇదతి పెద్ద దుమారం రేపింది.
మాధవీ లత మసీదు మీదకి బాణం వదులుతున్నట్లు చూపిస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐం అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
‘‘హైదరాబాద్ ప్రజలు బీజేపీ ఉద్దేశాలు ఏంటో చూస్తున్నారు. బీజేపీ – ఆరెస్సెస్ కు చెందిన అసభ్యకరమైన, రెచ్చగొట్టే చర్యలను తిప్పికొడతారు. తరచూ బీజేపీ మాట్లాడే వికసిత్ భారత్ అంటే ఇదేనా?
హైదరాబాద్ నగర శాంతి భద్రతల కంటే బీజేపీకి ఎన్నికలే ఎక్కువా? తెలంగాణ ప్రజలు మరోసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని నేను విశ్వాసంతో ఉన్నాను’’ అని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.
ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారుతుండడంతో మాధవీ లత క్షమాపణలు చెప్పారు.
తనపై వ్యతిరేకతను సృష్టించేందుకు తన వీడియో ఒకదానిని సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టినట్లుగా తన దృష్టికి వచ్చిందని, కానీ, అది ఒక అసంపూర్ణమైన వీడియో అని అన్నారు.
వీడియోను ఎడిట్ చేసి.. అపార్థాలు తలెత్తేలా చేశారని ఆరోపించారు. అయినా.. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.
తాను అందరినీ గౌరవిస్తాను కాబట్టి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. అయితే క్షమాపణతో ఈ వివాదం సమసిపోతుందా? లేక ఎన్నికల్లో ప్రధాన అంశం అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది.
దశాబ్ధాలుగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్న ఎంఐఎంకు ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో ఎప్పుడూ ముస్లింల ఓట్లకే పరిమితమై.. వారిని మాత్రమే ఓట్లు అభ్యర్థించే అసదుద్దీన్.. ఈసారి దళితులు, బీసీలను కూడా ఓట్లు అడుగుతుండడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో మాధవీలత చర్యను ఒవైసీ అంత తేలిగ్గా వదిలేస్తారా? లేక ఎన్నికల్లో దీని ద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారా? అన్న చర్చ మొదలైంది.
Also Read This Article : ఐపీఎల్ కప్ బీజేపీదే.. కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు
