B-Form :
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు లోపు పార్టీ ‘బీ’ ఫారాలు సమర్పిస్తారు.
ప్రతి ఎన్నికలోనూ ఇలాగే ‘బీ’ ఫారాలు సమర్పిస్తారు.
‘బీ’ ఫారం సమర్పించిన వారినే సదరు పార్టీ అభ్యర్థిగా గుర్తిస్తారు. అయితే ఇంతకీ ‘బీ’ ఫారం అంటే ఏమిటి? ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారందరికీ ఇదే సందేహం వస్తుంది. అదేంటో చూద్దాం..
ఏదైనా ఒక గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీ.. ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధులు వీరే అంటూ ఆ పార్టీ ప్రతినిధి ఇచ్చేదే ‘బీ’ ఫారం.
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును అతనికి కేటాయిస్తారు.
ఆ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫారాన్ని అభ్యర్థికి అందజేస్తారు. బీ ఫారం ఉంటే ఆ అభ్యర్థిని ఒక రాజకీయ పార్టీ తమ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నట్టు లెక్క.
దానివల్ల గుర్తింపుపొందిన పార్టీ అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తు మీద అతడు పోటీ చేయొచ్చు.
ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తు వాడుకునే అవకాశం ఉంటుంది. బీ ఫారం ఒకరికి ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థికి ఇవ్వడం కుదరదు.
కానీ సాధారణంగా రాజకీయ పార్టీలు అసలు అభ్యర్థితో పాటు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయిస్తాయి. ఇలాంటివారిని డమ్మీ అభ్యర్థులంటారు.
నిజానికి వీరిద్దరూ ఒకే పార్టీకి చెందినవారుగా ఉంటారు. ఒకవేళ అసలు అభ్యర్థి నామినేషన్ పత్రం ఏదైనా కారణంతో తిరస్కరించబడితే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థి సమర్పించిన బీ ఫారాన్ని వాడుకొనే అవకాశం ఉంటుంది.
అందుకే ముందు జాగ్రత్తగా ఆయా పార్టీలు డమ్మీ అభ్యర్థులతో నామినేషన్ వేయిస్తుంటాయి.
‘ఏ’ ఫారం…
ఎన్నికల ప్రక్రియలో ‘బీ’ ఫారంతోపాటు ‘ఏ’ ఫారానికీ ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ అభ్యర్ధిగా ఒకరిని ఎంపిక చేసి అతనికి ‘బీ’ ఫారం అందించే వ్యక్తి ఇచ్చేదే ‘ఏ’ ఫారం.
పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ‘ఏ’ ఫారం అందిస్తుందో అతనికి మాత్రమే తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులకు ‘బీ’ ఫారం అందించే అధికారం ఉంటుంది.
‘ఏ’ ఫారం అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు లభించిన ‘ఏ’ ఫారాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు.
అందులో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను తెలియజేస్తారు.ఈ ఫారం మీద ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది.
అలాగే ఆ పార్టీ ముద్ర కూడా ఉంటుంది. ఏ ఫారం లోని అభ్యర్థలు జాబితాలో ‘బీ’ ఫారం పొందిన వ్యక్తి పేరు తప్పనిసరిగా ఉండాలి.
ఒకవేళ ఏదైనా కారణంతో అభ్యర్థిని మారిస్తే.. మరో ‘ఏ’ ఫారాన్ని సదరు రాజకీయ పార్టీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రతి రాజకీయ పార్టీ తగిన నిపుణులను నియమించుకుంటుంది.
Also Read This Article : ఐపీఎల్ కప్ బీజేపీదే.. కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు