MLC Kavitha :
తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి కవిత లేఖ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు బెయిలు ఇవ్వాలంటూ చేసుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నారాజ్ అయ్యారు.
‘నేను బాధితురాలిని.. నా అరెస్టు అక్రమం.. నాకు న్యాయం కావాలి’ అంటూ తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి మంగళవారం లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత పేర్కొన్నారు. ఈ మేరకు నాలుగు పేజీల ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది చేకూరలేదని కవిత స్పష్టం చేశారు.
రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, తన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగా పెట్టిన కేసు అని లేఖలో పేర్కొన్నారు.
తప్పుడు కేసు పెట్టి తనను అరెస్టు చేశారని ఆరోపించిన కవిత.. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాఫ్తు చేస్తున్నాయని చెప్పారు. దర్యాఫ్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరించానని వివరించారు.
పిలిచినప్పుడు వెళ్లి అధికారుల ప్రశ్నలు అన్నింటికీ జవాబిచ్చినట్లు తెలిపారు.
అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని, ఈ కేసులో తానే బాధితురాలినని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసు దర్యాఫ్తు మొత్తం మీడియా ట్రయల్స్ గా మారాయని, మీడియాలో సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
బీజేపీలో చేరితే ఈ కేసు విచారణ ఆగిపోతుంది..
‘టీవీ ఛానల్స్ నా ఫోన్ నెంబర్ చూపించాయి. దీంతో నా ప్రైవసీకి భంగం కలిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు సార్లు విచారణకు హాజరయ్యా.
అధికారులు అడగడంతో బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చా. నా మొబైల్ ఫోన్లను కూడా అందించి విచారణకు పూర్తిగా సహకరించా.
కానీ, అధికారులు మాత్రం నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపించారు. రాజకీయంగా నా పరపతిని దెబ్బతీయడమే ఈ కేసు వెనక ఉన్న ఉద్దేశమని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది.
ఇదొక్కటే కాదు.. ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాఫ్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి.
బీజేపీలో చేరితే ఈ కేసుల విచారణ ఆగిపోతుంది. మళ్లీ వాటి ఊసే వినిపించదు. సాక్షాత్తూ పార్లమెంట్ లోనే బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీలను బెదిరించారు.
నోర్మూసుకుంటారా లేక ఈడీని పంపించాలా అంటూ హెచ్చరించారు. లిక్కర్ స్కాం కేసులో దర్యాఫ్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తా. ఈ కేసులో బెయిల్ నాకు ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ కవిత తన లేఖలో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
Also Read This Article : జనసేనకు భారీ షాక్.
