Danam Nagender :
ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయకపోవడం వల్లే?
సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ నుంచి ఆయనను తప్పించి మరొకరిని బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్.. తాజాగా కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో దానం ను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి తమ ఎంపీ అభ్యర్దిగా ప్రకటించింది. ఇదే సమయంలో దానం ను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. అయితే ఇందుకు తొలుత అంగీకరించిన నాగేందర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి ఆయన అంగీకరించినందునే మూడో జాబితాలోనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కానీ, దానం తన ఎమ్మెల్యే పదవికి ఇప్పటిదాకా రాజీనామా చేయలేదు. ఇదే సమయంలో దానం పై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. కోర్టు సైతం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
బొంతు రామ్మోహన్ ను బరిలోకి దించే యోచనలో కాంగ్రెస్
ఈ మొత్తం పరిణమాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ అభ్యర్థిగా తప్పించాలని చూస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని బరిలోకి దించేందుకు పార్టీ నాయకత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పేరు ఖరారైంది. ఈ స్థానంలో గెలవటం కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తుందనే ఆసక్తి కరంగా మారుతోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు తో పాటుగా మాజీ మంత్రి ఒకరి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ విషయంలో స్థానిక నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయనను కొనసాగించటం..లేదంటే మరో అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకుగాను కనీసం 14 స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తగ్గట్టుగానే వ్యూహాలు అమలు చేస్తోంది.
Also Read This Article : వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి?

Also Read This Article : బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్….