...

Kadiyam left BRS : వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి?

కుమార్తె కావ్యను స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచన

షాకుల మీద షాకులతో కుదేలవుతున్న బీఆర్ఎస్

లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరునే కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. అప్పుడు స్టేషన్ ఘన్ పూర్ కు జరిగే ఉప ఎన్నికలో తన కూతురు కావ్యను కాంగ్రెస్ తరఫున బరిలో నిలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హామీ ఇచ్చారని, ఈ హామీ ఇచ్చాకే తండ్రీకూతుళ్లు ఇద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు అంగీకరించారని తెలుస్తోంది.

వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన బీఆర్ఎస్.. ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తే చేసింది. కడియం శ్రీహరి కూడా ఎప్పటి నుంచో తన కూతురుకు పొలిటికల్ ప్లాట్ ఫామ్ ఇవ్వాలని ఆలోచనతో పట్టుబట్టి మరీ కావ్యకు టికెట్ ఇప్పించి, తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో అప్పటికే టికెట్ పై ఆశలు పెట్టుకున్న కొంతమంది ఉద్యమకారులు ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలని పార్టీ అధినాయకులకు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కూడా విన్నవించారు. ఇదిలా కొనసాగుతున్న నేపథ్యంలోనే కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గురువారం లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్‌పై అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ లాంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకత్వం, పార్టీ కార్యకర్తలు తనను మన్నించాల్సిందిగా కోరారు. కావ్య నిర్ణయంతో బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా కంగు తిన్నారు.

 

కాంగ్రెస్ అధిష్ఠానం ఈ హామీ ఇచ్చాకే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకొన్న కావ్య?

వాస్తవానికి రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. ఇందులో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె అయిన కడియం కావ్యను మార్చి 13వ తేదీన ప్రకటించింది. ఆ తరువాత పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కావ్య.. నాలుగు రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా కలిశారు. ఇంతలోనే రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఈ హఠాత్పరిణామంతో ఓరుగల్లు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం చెలరేగింది. కాగా, తల్లీకూతుళ్లు కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది వరకే కడియం శ్రీహరిని కొందరు నేతలు కాంగ్రెస్ లోకి ఆహ్వానిచంగా.. అప్పట్లో ఆయన తిరస్కరించారు. కానీ, ఆ తరువాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, లిక్కర్ స్కామ్, తదితర బాగోతాలతో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, పార్టీలో సీనియర్ల మధ్య సఖ్యత లేకపోవడం, తన అభ్యర్థిత్వాన్ని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కడియం కావ్య పార్టీ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయమే తండ్రీకూతుళ్లు ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను కలిసిన తరువాతే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ విడుదల చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఇలా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీ కీలక నేతలుగా చెప్పుకునే లీడర్లు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతుండడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. ఏదేమైనా ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందు నుంచే రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తుండగా.. మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు తలెత్తుతాయోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Also Read This Article : టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్‌ మీడియా ప్రారంభం…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.