India Today Survey :
ఇండియా పేరిట విపక్షాలను కూడగట్టినా.. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రెండో విడత యాత్ర చేస్తున్నా.. ప్రతిపక్షంలో పదేళ్లుగా పోరాడుతున్నా.. ఇటీవల రెండు కీలక రాష్ట్రాల్లో అధికారం సాధించినా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒనగూరేదేమీ లేనట్లు తెలుస్తోంది. అందులోనూ వరుసగా మూడోసారి ఓటమి ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వ పటిమనో.. కాంగ్రెస్ నాయకత్వ లోపమో కానీ ఈసారి ఆ పార్టీకి కేంద్రంలో అధికారం అందదని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. అయితే, దీనిని పూర్తిగా నమ్మలేం.. అలాగని కొట్టి పారేయలేం.. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఇండియా టుడే చెప్పిన ఫలితాలు దాదాపు నిజం అయ్యాయి.
సీట్లు పెరిగినా ప్రతిపక్షమే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 71 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే చెబుతోంది. అంటే గతంతో పోలిస్తే 30 సీట్లు పెరుగుతాయి. కానీ, అధికార సాధనకు ఇవి ఏమాత్రం సరిపోవు. 543 స్థానాలున్న లోక్ సభలో కనీస మెజారిటీ 272. కానీ, కాంగ్రెస్ 40 ఏళ్ల కిందటే ఈ మార్కును సాధించే సత్తా కోల్పోయింది. ఇక 2019లో సొంతంగా 300 పైగా సీట్లు గెలిచి బీజేపీ తాను కాంగ్రెస్ స్థాయికి వచ్చినట్లు స్పష్టం చేసింది. కాగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరోసారి నిరాశ తప్పదని సర్వే పేర్కొంటోంది. రాష్ట్రాల వారీగా చేసిన సర్వేలో ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నేసి సీట్లు రావొచ్చో వివరించింది.
తెలంగాణలోనే డబుల్ డిజిట్
దక్షిణాదిలో సర్వే ప్రకారం చూస్తే తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ (10) దాటి సీట్లు వస్తున్నాయి. ఆశ్చర్యం ఏమంటే.. ఆరు నెలల కిందట బీజేపీని ఓడించి అధికారం దక్కించుకున్న కర్ణాటకలోనూ కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ సీట్ల నాలుగుకు మించడం లేదు. తమిళనాడులో ఎలాగూ డీఎంకేదే ఆధిపత్యం కాగా.. ఏపీలో ఒక్క సీటూ వచ్చే అవకాశాలు లేవు. రాష్ట్ర స్థాయిలో విభేదిస్తున్న కేరళలో మాత్రం లెఫ్ట్ ఫ్రంట్ పొత్తుతో ఎలా ముందుకెళ్తుందనేది చూడాలి. ఇక్కడ లెఫ్ట్ ఫ్రంట్ కు 20 సీట్లు నెగ్గనుంది. దీనికితోడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…