ఈ రోజు ప్రముఖ నటులు , నిర్మాత మురళీమోహన్ తన 61 వ వివాహ వార్షికోత్సవాన్ని
హైదరాబాద్ బేగంపేటలోని “దేవనార్ బ్లైండ్ స్కూల్ “లో అంద విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తన మరియు తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను లేదా వివాహ వార్షికోత్సవాలను దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకునే ఆనవాయితీని ప్రతి సంవత్సరము పాటిస్తుంటారు మురళీమోహన్. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు
దేవనార్ బ్లైండ్ స్కూల్లోని అంధ
విద్యార్థుల సమక్షంలో తన 61వ వివాహ దిన మహోత్సవాన్ని జరుపుకున్నారు మురళీమోహన్. ఈ సందర్భంగా స్కూలులో జరిగిన సభా కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు ప్రముఖ గాయకుడు – సంగీత దర్శకుడు – భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి, దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆయన సతీమణి జ్యోతి గౌడ్, మురళీమోహన్ సన్నిహిత మిత్రులు బిఎస్ రావు, ప్రముఖ ఫిలిం జర్నలిస్టు ప్రభు పాల్గొన్నారు.
ముందుగా దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ “మురళీమోహన్ గారి వంటి పెద్దలు, సహృదయులు ప్రతి సంవత్సరము తన మరియు తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను మా బ్లైండ్ స్కూల్ లోనే జరుపుకోవటం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఆయన ఈ రోజు మా బ్లైండ్ స్కూల్లోని 600 మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్,మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ కు అవసరమైన మొత్తాన్ని అందజేశారు.
అంతే కాకుండా బ్లైండ్ స్టూడెంట్స్ కు అత్యావశ్యకమైన బ్రెయిలీ లిపి పేపర్ బండిల్స్ ను కూడా బహుకరించారు. ఇలాంటి సహృదయులు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి” అన్నారు. భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ “మురళీమోహన్ గారు తన 61వ వివాహ మహోత్సవ దినాన్నే కాకుండా ఆయన ఇంట్లో జరిగే ప్రతి శుభ కార్యాన్ని ఇక్కడే.. ఈ బ్లైండ్ స్కూల్లోనే
జరుపుకోవటం ఆయన సహృదయతకు నిదర్శనం. ఈ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ముప్పై సంవత్సరాల క్రితం చిన్న స్థాయిలో రెండు గదుల్లో ఈ దేవనార్ బ్లైండ్ స్కూల్ ను ప్రారంభించి ఇప్పుడు దీన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకువెళ్లటం అభినందనీయం. వారి కృషి , పట్టుదల వల్ల ఈ స్కూల్ జాతీయస్థాయిలో గుర్తింపు పొంది అనేక అవార్డులను
కూడా సొంతం చేసుకుంది . ఈ కార్యక్రమ ప్రారంభంలో విద్యార్థులు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఆలపించడం నన్ను నిజంగా కదిలించి వేసింది . మన జీవ నదిగా ..మన హైందవ జీవన విధానంలో భాగమైన భగవద్గీతను మనకంటే ఎక్కువగా అమెరికా జర్మనీ ,జపాన్ వంటి విదేశాల వారే ఎక్కువగా ఆలపిస్తున్నారు.. అనుసరిస్తున్నారు. కానీ మనదేశంలో పుట్టిన భగవద్గీత గీతకు,మన కృష్ణుడు బోధించిన భగవద్గీతకు మనదేశంలోనే తగినంత ఆదరణ లభించకపోవడం దురదృష్టకరం . ఈ పరిస్థితి మారి ప్రతి హిందువు హైందవ ధర్మ పరిరక్షణలో భాగమైన భగవద్గీతను చదవాలి..చదివించాలి…అన్నారు . మురళీ మోహన్ మాట్లాడుతూ ” నేను ప్రతి సంవత్సరం నా బర్త్ డే.. మ్యారేజ్ డే వేడుకలను ఇక్కడే జరుపుకుంటాను. వచ్చిన ప్రతిసారి ఈ స్కూల్ మరింత విస్తృతం అవ్వటాన్నీ గమనించాను. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మన కన్నబిడ్డల్ని కూడా ఇంత ప్రేమగా చూసుకోలేమెమో.. అలాంటిది చూపులేని ఈ చిన్నారులను ఎంతో ప్రేమగా..బాధ్యతగా చూసుకుంటూ దీన్ని ఇంతగా అభివృద్ధి చేసిన సాయిబాబా గౌడ్ గారికి.. వారి శ్రీమతి జ్యోతి గౌడ్ గారికి.. స్టాఫ్ అందరికీ నా అభినందనలు . ఈ పిల్లలు భగవద్గీతను అభ్యసించి ఆలపించటం నాకు చాలా ఆశ్చర్యంగా.. ఆనందంగా అనిపిస్తుంది అందుకే ఈ కార్యక్రమానికి భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించాను నా ఆహ్వానాన్ని మన్నించి పిలిచిన వెంటనే వచ్చిన గంగాధర శాస్త్రి గారికి కృతజ్ఞతలు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మురళీమోహన్ సన్నిహిత మిత్రులు బిఎస్ రావు, సీనియర్ ఫిలిం జర్నలిస్టు ప్రభు తమ సంక్షిప్త ప్రసంగాలలో మురళీమోహన్ కు వివాహ దిన శుభాభినందనలు తెలియజేశారు. ఆ తరువాత భోజనశాలలో మురళీమోహన్ స్వయంగా అంధ విద్యార్థులకు భోజనాలు వడ్డించారు.