మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ‘మలేసియా తెలుగు పునాది’ సంస్థ 12వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. మలేసియాలో స్థిరపడిన తెలుగు వారు తమ సంస్కృతి సంప్రదాయాలను సంరక్షించుకుంటూ ఒకరికొకరు సహకరించుకోవడంలో విశేష కృషి చేస్తున్న సంస్థ ‘మలేసియా తెలుగు పునాది’ మే9న కౌలాలంపూర్ లోని రాయల్ కామన్ వెల్త్ సొసైటీ ఆఫ్ మలేసియాలో వందలాది మంది తెలుగు కుటుంబాల సమక్షంలో 2 కార్యక్రమాలను నిర్వహించింది. మొదటిది తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారిపై వెలువరించిన ‘సజీవ చరిత్ర’ పుస్తక ఆవిష్కరణ, రెండవది వ్యవసాయంలో కృత్రిమ మేథ ఉపయోగం.
తొలి కార్యక్రమానికి ఇండియా నుండి ‘ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ టి.డి. జనార్థన్, ఎన్.టి. రామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణలు విశిష్ఠ అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక అతిధిగా డాటుక్ సహదేవన్, డాటుక్ డా. కృష్ణమూర్తి విచ్చేశారు.
ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ‘సజీవచరిత్ర’ 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తకాన్ని శ్రీ టి.డి. జనార్థన్, శ్రీ నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేసిన శ్రీ టి.డి. జనార్థన్ ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంలోని విశిష్ఠ సంఘటనలను, ఆయన వ్యక్తిత్వ విశేషాల్ని, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు, 9 నెలల స్వల్ప కాలంలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా శ్రీ ఎన్.టి. రామారావు చేపట్టిన చారిత్రక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మహత్తర పథకాలు, మహిళల సాధికారతకు తెచ్చిన తండ్రి ఆస్తిలో సమానహక్కు, విద్య, ఉపాధి, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు మొదలైన వాటిని శ్రీ జనార్థన్ వివరించారు. 2023లో ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని తాము ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ద్వారా ఎన్టీఆర్ భావజాలాన్ని తర్వాతితరాలకు తెలియజేయడానికి పలు పుస్తకాలు తెస్తున్నామని, తాను స్వయంగా ప్రపంచంలోని అనేక దేశాలలో పర్యటిస్తూ తెలుగు వారిని కలుసుకుంటూ ఎన్టీఆర్ పై వారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ భావజాలం సజీవం అని నేటికి ఆచరణీయం అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా శ్రీ నారాచంద్రబాబు నాయుడుగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధి, అలాగే నవ్యాంద్రప్రదేశ్ లో నేడు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఎన్టీఆర్, చంద్రబాబు గారి అడుగు జాడల్లో శ్రీ నారా లోకేష్ ప్రయాణిస్తూ తెలుగు దేశం పార్టీకి కొత్త రూపు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ‘మలేసియా తెలుగు పునాది’ నిర్వాహకులు డాటుక్ ఆర్. రావు ఆయన సహచరులను అభినందించారు. ఎన్టీఆర్ పై తాము రూపొందించిన ‘అన్న ఎన్టీఆర్’ యూట్యూబ్ చానల్ ను ఇక్కడి తెలుగు వారు వీక్షించాలని కోరుతూ, ఎన్టీఆర్ మరణంలేని మహా మనిషని చెప్పారు.
కార్యక్రమంలో మరో విశిష్ఠ అతిధిగా పాల్గొన్న శ్రీ నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తమ తండ్రి శ్రీ ఎన్.టి. రామారావు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. తమ సోదరుడు నందమూరి బాలకృష్ణ, తన వివాహాలు 1982లో తిరుపతిలో జరిగినపుడు ఎన్నికల ప్రచారంలో వున్న తమ తండ్రి ఫోన్ ద్వారానే తమను ఆశీర్వదించారే తప్ప వివాహాలకు హాజరు కాలేదని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి అదే నిదర్శనం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ ల్యాండ్ ఫైనాన్స్ కోఆపరేటివ్ మేనేజింగ్ డైరెక్టర్ డాటుక్ సహదేవన్, మలేసియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాటుక్ ఆర్. కాంతారావు ఆకు నాయుడు, డాటుక్ డాక్టర్ కృష్ణమూర్తి, మలేసియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రమణ, ఇంకా ఎన్.బి. లచ్చు, మోహన రెడ్డి, ప్రాఫెసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక తెలుగువారు ఇచ్చిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చక్కటి తెలుగు భోజనంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.