Vijay Devarakonda: వాళ్లకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తినిస్తోంది

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా జూలై 31న విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటని విలేకరులు ప్రశ్నించగా.. ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమనే తన దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్ అని విజయ్ దేవరకొండ తెలిపాడు. వాళ్ళకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుందన్నారు.. చాలా రోజుల తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూశానని పేర్కొన్నారు. మొదటి షో పూర్తవ్వగానే చాలామంది ఫోన్లు చేసి ‘మనం హిట్ కొట్టినం’ అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది. కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది.

పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కింగ్‌డమ్ విడుదలకు ముందు మాక్కూడా ఆలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది. గౌతమ్ కుటుంబ బంధాలను, ఎమోషన్స్‌ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జెర్సీ లాంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్‌డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం పెట్టాలి కదా అన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.

ఈ సినిమాలో ఆయుధాలతో ఓటింగ్ వేసే సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. గౌతమ్ కథ చెప్పినప్పుడు ఓటింగ్ వేసే సన్నివేశాల గురించి చెప్పాడు కానీ, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఆ తర్వాత ఇలా గన్‌లు, కత్తుల వంటి ఆయుధాలతో ఓటింగ్ ఉంటుంది చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు వంటి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్‌లు చూశాను. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్ గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను.

మే నెలలో మండుటెండలో ఆ సీన్ షూట్ చేశాము. చిత్రీకరణ సమయంలో ఓ మంచి సన్నివేశం చేస్తున్నామన్న సంతృప్తితో చేశాము తప్ప.. జెర్సీ మూమెంట్ అనే ఆలోచనతో చేయలేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఆ సీన్ గురించి గొప్పగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఉంది. సినిమా చూసి సుకుమార్ గారు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.  తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది. రాహుల్, రవి ఇద్దరూ ఎంతో ప్రతిభగల దర్శకులు. ఇద్దరూ అద్భుతమైన కథలను సిద్ధం చేశారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *