‘వేదం’కు 15 ఏళ్లు.. కథ పుట్టడం నుంచి ప్రతిదీ ఆసక్తికరమే..

‘వేదం’ సినిమా వచ్చి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అవార్డుల పంట పండించింది. అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క కీలక పాత్రల్లో నటించారు. 2010 జూన్‌ 4న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. కీరవాణి సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. ఈ అసలు ఈ సినిమా కథ ఎలా పుట్టుకొచ్చిందో ఓ సందర్భంలో దర్శకుడు క్రిష్ వెల్లడించారు. దీనికి ముందు క్రిష్ తీసిన ‘గమ్యం’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్‌ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘గమ్యం’ సక్సెస్ తర్వాత విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వార్షికోత్సవానికి పిలిస్తే అక్కడకు క్రిష్ వెళ్లి.. అమరావతి పక్కనే ఉణ్న వైకుంఠపురం ఆలయానికి వెళ్లారట. అక్కడ వైష్ణవి అనే అమ్మాయి, ఆమె తమ్ముడు గుడికి వచ్చారట.

కథకు మూలం ఇదే..

క్రిష్‌ను చూడగానే గుర్తుపట్టిన వైష్ణవి.. ‘గమ్యం’ సినిమాను ప్రస్తావిస్తూ పలకరించిందట. వారితో మాట్లాడిన తరువాత ఉండవల్లి గుహలను చూసేందుకు వెళ్లారట. ఒక్కడో చిన్న పిల్లాడు.. వృద్ధుడి వేలు పట్టుకుని తీసుకెళుతున్న దృశ్యాన్ని చూసి వెంటనే ఫోటో తీశారట. అదే కథకు మూలమట. వెట్టి చాకిరి చేస్తున్న చిన్న పిల్లాడిని విడిపించడానికి వాళ్లమ్మ కిడ్నీలు అమ్ముకుంటుందట. ఇదే ‘వేదం’ కథకు మూలం. ఆ సమయంలో ‘ఆర్య 2’ షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ కాల్ చేసి ‘మనిద్దరం ఒక సినిమా చేద్దామని చెప్పాడట. షూటింగ్‌కు బ్రేక్ ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి భోజనానికి వెళ్లారట. అప్పుడు బన్నీకి క్రిష్ వేదం కథ చెప్పారట. అలా బన్నీ ఓకే చెప్పడం.. సినిమాను తనే ప్రొడ్యూస్ చేస్తాననడం చకచకా జరిగిపోయాయి. మంచు మనోజ్‌కు సినిమా గురించి చెప్పడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.

అనుష్క హోర్డింగ్ చూసి 40కి పైగా యాక్సిడెంట్స్..

ఇక అసలు చిక్కంతా అనుష్కతోనే. వేశ్య పాత్రకు ఆమెను ఒప్పించడమంటే మాటలా? కానీ ఆమె చేస్తేనే సినిమా ఓ లెవల్లో ఉంటుందని బన్నీ చెప్పడంతో భయపడుతూనే వెళ్లి అనుష్కకు క్రిష్ కథ చెప్పారట. అది విన్న అనుష్కకు కన్నీళ్లాగలేదట. మొత్తానికి అందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేదం సినిమా పట్టాలెక్కింది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాలో కొంటె చూపులు చూస్తున్న అనుష్క హోర్డింగ్‌ను పంజాగుట్ట సెంటర్‌లో పెట్టారు. అనుష్కను చూస్తూ అయ్యాయో.. మరో కారణమో కానీ 40కి పైగా యాక్సిడెంట్స్ అక్కడ అయ్యాయట. వెంటనే జీహెచ్ఎంసీ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ హోర్డింగ్‌ను తొలగించారు. అనుష్క క్రేజ్ అంతలా ఉండేది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *